ప్రభుత్వ ఉద్యోగుల వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాలను పెంపొందించడం, పరిపాలనలో ఆధునిక విధానాలను ప్రోత్సహించడం ప్రధాన అంశాలుగా ఈ సదస్సు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, ఉద్యోగుల శిక్షణలో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులపై అధికారులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరికి చెందిన అధికారులు హాజరయ్యారు.
ఉన్నతి కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాల పెంపునకు ఐగాట్ (iGOT), మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా కార్యాచరణను రూపొందించనున్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలను కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా పరిమితం చేయకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచే సంస్థలుగా తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
రెండు రోజుల సదస్సులో వివిధ రాష్ట్రాల అనుభవాలను పరస్పరం పంచుకోవడంతోపాటు ఉద్యోగుల శిక్షణలో నాణ్యతా ప్రమాణాలు, పరిపాలనా సామర్థ్యాల అభివృద్ధి, ప్రభుత్వ సేవల మెరుగుదలకు అవసరమైన కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.
